దేవుని(క్రీస్తు)కి దాసులు

దేవుని(క్రీస్తు)కి దాసులు

దేవునికి దాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆయనకు దాసులుగా జీవించేవారు అంటే ఆయనకిష్టులని వాక్యం చెబుతుంది.”క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడనైయున్నాడు”(రోమా 14:18).యేసునందు విశ్వాసముంచుటకు ముందు అనేక విషయాలలో దాసులుగా జీవించాము. అలాంటి దాసత్వము నుండి యేసు తన రక్తాన్ని చిందించి దాసత్వము నుండి విమోచించాడు. ఏ దాసత్వము నుండి విమోచన దయచేయుటకు మన కొరకు యేసు సిలువలో మరణించాడో మరలా తిరిగి ఆ దాసత్వంలోకి వెళ్ల కుండా క్రీస్తు కొరకు జీవిస్తే ఆయనకు దాసుమవుతాము. ఒకప్పుడు ఎవరెవరికి,దేనికి దాసులుగా వున్నామో వాక్యపు వెలుగులో చూచి ఎల్లప్పుడు క్రీస్తుకు దాసులుగా ఉండడానికి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం.
క్రీస్తుని ఎరుగకముందు మనము ఎవరికి దాసులుగా ఉన్నాము.

1.నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులమై
యుంటిమి.

“ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై యుంటిరి…”(గలతీ 4:8) అవును దైవములు కానీ(2దిన 13:9) దైవత్వం లేని(యిర్మీయా 2:11) వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ ఇశ్రాయేలీయులు వాటికి దాసులు అయినారు కానీ యెహోవాయే నిజమైన దేవుడు అని ఇశ్రాయేలీయులకు(యిర్మీయా 10:10)చెబుతున్నాడు.ఇప్పుడు మనము కూడా నిజమైన దేవుని ఎరిగినవారము మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నాము గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠములు తట్టు తిరుగనేల?(గలతీ 4:9) అని పౌలు గారు సంఘాలకు బోధిస్తున్నాడు. కనుక నిజముకాని దేవుళ్లకు మనము దాసులు కాకుండా వుందాము.

2.లోక సంబంధమైన మూలపాఠములకు దాసులమై యుంటిమి.

“లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి”(గలతీ 4:3) అనగా మనుష్యుల పారంపర్యాచారములకు,బలహీనమైన నిష్ప్రయోజనమైన వాటికి అనగా దినములు మాసములు ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచూ దాసులమై ఉన్నాము(గలతీ 4 10). కానీ ఇప్పుడు మనము దాసులము కాదు కుమారులమే(గలతీ 4:7).ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు మూలపాఠాల నుండి విమోచించుటకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి తనకు దత్తపుత్రులునుగా చేసుకున్నాడు(గలతీ 4:4-5). కనుక మనము తండ్రియైన దేవునికి కుమారులమే కానీ దాసులము కాము. క్రీస్తుకు దాసులము కావాలి.

3.దురాశకు భోగములకు దాసులముగా యుంటిమి.

“…..మనము కూడా మునుపు అవివేకములమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమునై వుండి…(తీతు 3:3). ఒకప్పుడు అవివేకంతో దేవునిని ఎరుగక దేవునికి అవిధేయులమై దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి అవసరమైనవి చేయక శరీర ఇష్టాన్ని నెరవేరుస్తూ దురాశకు భోగములకు దాసులుగా జీవిస్తుండగా మోసపోయామని గ్రహింపలేని వారముగా ఉంటుండగా రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవులపై ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమై పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేసి రక్షించెను.(తీతు 3:4-5). కనుక మనలను రక్షించిన దేవాది దేవునికి మనము దాసులుగా వుందాము.

4.దుర్నీతి కార్యములు చేయుటకు మన శరీరాలను దాసులుగా చేసాము

“శరీర బలహీనతనుబట్టి అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో..(రోమా 6:19). ఒకప్పుడు దుర్నీతి కార్యాలు చేయుటకు మన శరీర అవయువాలను అప్పగించి దాసులుగా వుండేవారము. కానీ ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మన అవయవములను నీతికి అనగా దేవుని నీతి అయిన యేసుకి దాసులుగా అప్పగించాలి.


5.మనుష్యులకు దాసులుగా ఉంటిమి

“మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి “(1కొరింథీ 7:23). మనుష్యులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని భావించి మనుష్యుల పద్ధతులకు దాసులుగా జీవించాము. అయితే ఇప్పుడు క్రీస్తు మన కొరకు శ్రమపడి మనుషుల పద్ధతులను ఆచారాలను సిలువ వేశాడు. “ఇక మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొందుము(1పేతురు 4:2). మనుష్యుల దయను సంపాదించుకొన చూస్తే మనము క్రీస్తుకు దాసులమే కాదు.మనుష్యులను సంతోషపెట్టు వారమైతే క్రీస్తుకు దాసులము కాదు(గలతీ 1:10).మనుష్యులను సంతోషపెట్టే బోధ చేస్తే క్రీస్తునకు దాసులము కాము (1థెస్స 2:4).


కనుక దేవునికి దాసులైన తర్వాత మనుష్యుల కోసం తపిస్తూ వారి మెప్పు కోరుతూ వారిని సంతోష పెట్టకుండా మనుష్యులకు దాసులు కాకుండా మన కొరకు ప్రాణాలర్పించిన యేసుక్రీస్తుకి దాసులుగా వుందాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *