దేవుని కొరకు కనిపెట్టుట
క్రైస్తవ భక్తి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు కలిగినప్పుడు బాధలు,వ్యాధులు ,ఇబ్బందులు
,సమస్యలు మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు మనకు ఉన్నవాటి(ఆస్తి,ధనము,ఘనత, పేరు, ప్రతిష్ట, బంధువులు, స్నేహితులు.) మీద ఆధారపడక దేవుని వైపు చూస్తూ వేచియుండుటయే దేవుని కొరకు కనిపెట్టుట. ఈ విధముగా ఎంతో గొప్ప స్థితిలో ఉండి కూడా దేవుని కొరకు కనిపెట్టిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకి మాదిరిగా ఉన్నారు. అట్టివారిలో దావీదు రాజు, యోబు భక్తుడు మనకి కనపడుతున్నారు.
1.దావీదు దేవుని కొరకు దినమెల్ల కనిపెట్టుచున్నాడు
“నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను”(కీర్తన 25:5).ఇక్కడ దావీదు భక్తుడు దేవుని కొరకు కనిపెట్టుట ఎలాగో మనకి నేర్పుచున్నాడు.దేవుని మీద దావీదుకి వున్న అభిప్రాయం ఏమిటంటే రక్షించువాడు ఆయనే అని నమ్ముతున్నాడు. కనుకనే ప్రతి విషయంలో దేవుని మీదే ఆధారపడి రక్షణకర్తవైన దేవుని వైపు దినమెల్ల కనిపెట్టుచున్నాడు. దావీదు రాజైన కూడా తన సైన్యం మీద గాని,తనకున్న రధముల మీద గాని,తన సొంత తెలివితేటల మీద గాని,తన ఆలోచన ప్రకారం ఏర్పరచుకున్న మార్గముపై గాని ఆధారపడక రక్షణకర్తయైన దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తము కొరకు ఆయన వైపు చూస్తూ కనిపెట్టుచున్నాడు. మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు మనము కూడా దేవుని వైపు చూడాలని దావీదు మనకు నేర్పుతున్నాడు.
2.యోబు దేవుని కొరకుకనిపెట్టుచున్నాడు
“ఇదిగో ఆయన నన్ను చంపబోవుచున్నాడు నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును”(యోబు 13:15). తనని సృష్టించిన దేవుడే తనని చంపుబోతున్నాడు అయినా నేను ఆయన కొరకే కనిపెడతాను అంటున్నాడు. యోబు కి దేవుడంటే ఎంత విశ్వాసం ఎంత విధేయత యోబు గూర్చి మనం పరిశీలించినట్లయితే ఏ పాపం చేయకపోయినా,అంతా కోల్పోయినా,స్నేహితులు నిందలు వేస్తున్న తరుణంలో దేవుడు ఒకవేళ నా ప్రాణం తీసినా నేను ఆయన కొరకే కనిపెడతాను అని అంటున్నాడు.ఎందుకని సామెతలు 14:32 లో “…..మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు” అని వాక్యం చెబుతుంది.అంటే యోబు నీతిమంతుడు కనుక తన మరణకాలంలో ఆశ్రయం
దేవుడే అని నమ్మకంతో దేవుని వైపు చూస్తూ కనిపెట్టుచున్నాడు, తనకున్న ధనము, ఆస్తి తనకి ఆశ్రయం కాదని తనకున్న ధనం మీద, ఆస్తి మీద ఆధారపడక దేవుని మీదే ఆధారపడి ఆయన చిత్తమునకు తలవంచిన భక్తులలో యోబు కూడా ఒకరు.
మనము కూడా దేవుడే మన రక్షణకర్త అని
మనము నీతిగా జీవిస్తే మరణములో దేవుడే మనకు ఆశ్రయముగా వుంటాడని నమ్మి దేవుని వైపు చూస్తూ కనిపెడదాము.దేవుని కృప మనందరికీ తోడై వుండును గాక.ఆమెన్.