జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులైన పాస్టర్ బడుగు విజయప్రసాద్ రావు గారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో బడుగు ప్రకాశరావు – సుబ్బాయమ్మ గార్ల దంపతులకు ఐదవ సంతానముగా 1967 ఆగష్టు 7వ తేదీన కనిష్టుడుగా జన్మించారు. వీరికి నలుగురు సోదరులు. దేవుడు తన నిత్యమైన సంకల్పము ద్వారా పాస్టర్ బడుగు విజయ ప్రసాద్ గారిని రక్షించి కరుణా సంపన్నుడైన క్రీస్తు సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించారు.
విజయప్రసాద్ గారి బాల్యమంతా వారి స్వగ్రామమైన కైకలూరులోనే గడిచింది. చదువుపట్ల, క్రీడలపట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. సాధారణ విద్యలో డిగ్రీ (B.Com) పూర్తి చేసి క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండుట వలన వ్యాయామ ఉపాధ్యాయునిగా శిక్షణ పొందుటకు ఏలూరు జిల్లా గోపన్నపాలెం గవర్నమెంట్ వ్యాయామ కళాశాలలో
(U.G.D.P.E.T) శిక్షణ పొంది తరువాత వివిధ ప్రైవేట్ స్కూల్లో తాత్కాలికంగా వ్యాయామ ఉపాధ్యాయునిగా ఉద్యోగము చేస్తూ ఉండగా 1995 మార్చి 18న కృష్ణాజిల్లా నాగాయలంక మండలం చోడవరం దివి తాలూకా వాస్తవ్యులు చాట్రగడ్డ అమ్మన్న – సామ్రాజ్యం గార్ల ద్వితీయ కుమార్తె పద్మ కుమారితో వివాహము జరిగింది. తరువాత వీరిద్దరికీ ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు.
పై చదువుల నిమిత్తం కడప జిల్లాలో జియోన్
వ్యాయామ ఉపాధ్యాయ కళాశాలనందు 1998 వ సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) కూడా పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో వీరి కుమార్తె నీళ్ల కుండీలో పడి చనిపోయింది. ఈ బాధాకరమైన సంఘటన మరిచిపోవటానికి వారి ప్రాంతం నుండి హైదరాబాద్ ప్రయాణమై తన భార్య, కుమారునితో కలిసి వెళ్లి కొంతకాలం నివసించారు. వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం చేసి తరువాత మల్కాజిగిరిలో సెయింట్ మేరీస్ లిటిల్ స్కూల్ నందు P.E.T. గా ఒక సంవత్సరం పాటు పనిచేసి 2003వ సంవత్సరం నవంబర్ నెలలో కొన్ని పరిస్థితులు వలన విజయవాడ వచ్చి పడమటలోని ఫెయిత్ హోమ్ చర్చినందు ఆత్మీయంగా ఎదుగుచుండగా వీరిలోనున్న సంఘ పరిచర్య భారాన్ని గుర్తించి, పాస్టర్ వై. జోసఫ్ కుమార్ గారు వాక్యాన్ని ప్రకటించడానికి జి. కొండూరు, కానూరు, అశోక్ నగర్, ఎనికెపాడు సహవాసం సంఘాలలో బోధించుటకు వెళ్ళమని ఎంతగానో ప్రోత్సహించారు.
2004వ సంవత్సరము నుండి 2009వ సంవత్సరం వరకు విజయవాడ ప్రాంతంలో పటమట బాలురు హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా (విద్యావాలంటీర్) చేస్తూ ఉండగా క్రీస్తు సేవ నిమిత్తము 2007వ సంవత్సరం జూన్ 4వ తేదీన కైకలూరులో సేవ ప్రారంభించారు.
ఈ సంఘము వీరి ఆత్మీయ నాయకులు పాస్టర్ కోటా ప్రభుదాసు గారు దేవుని దర్శనం ద్వారా ఆయన వీరికి అప్పగించి వారు తన స్వగ్రామమైన ఉప్పులూరు వెళ్లిపోయారు. అప్పటి నుంచి దేవుని సేవ మరియు ఉద్యోగం చేస్తూ 2009 వ సంవత్సరం మార్చి నెలలో పూర్తికాల క్రీస్తు సేవలో కొనసాగుతూ ఉన్నారు. ఇదే సమయంలో 2009వ సంవత్సరములో పడమట దర్శిపేటలో ఒక ముస్లిం కుటుంబం రక్షింపబడగా అదే ఇంటిలో సంఘము నడుపుతూ ఉన్నారు.
ఇదే సమయంలో 2010-2018 సంవత్సరం వరకు బైబిల్ గూర్చిన తర్ఫీదు పొందారు. హైదరాబాద్ లోని ఆంధ్రా క్రిస్టియన్ వేదాంత కళాశాల (ACTC) లో డిప్లొమా ఇన్ బైబిల్ ట్రైనింగ్ (DBT) పూర్తి చేసి తర్వాత ఇండియా థియోలాజికల్ సెమినరీ (ITS) విజయవాడ బ్రాంచి నందు బ్యాచిలర్ ఆఫ్ థియోలజీ (B.Th) ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ థియోలజీ (M.Th) పూర్తి చేశారు. తదుపరి తాను నేర్చుకున్న బైబిల్ జ్ఞానం అనేకమందికి నేర్పాలన్న సంకల్పముతో జే.సి.ఎఫ్ మినిస్ట్రీస్ ద్వారా క్రిస్టోస్ థియోలాజికల్ సెమినరీ (CTS) అనే బైబిల్ విద్యా కేంద్రాన్ని 2019 జనవరి 19వ తేదీన ప్రారంభించారు. సంఘ భేదం లేకుండా బైబిలు విద్యార్థులకు వివిధ బైబిలు కోర్సులు నేర్పిస్తున్నారు. అంతేకాకుండా వీరు మంచి గాయకులు మరియు రచయిత. కావున కొన్ని పాటలు రచించి స్వరకల్పన, గానం చేసి రికార్డు చేసి యూట్యూబ్ చానెల్ ద్వారా విడుదల చేశారు. విజయ ప్రసాద్ గారు సంఘ కాపరిగా బైబిలు బోధకులుగా మరియు గ్రంథ రచయితగాను ప్రభువు కృపచేత ఆయన కొరకు ఈ పరిచర్యలను జరిగిస్తున్నారు.
వీరి పరిచర్య అంతా అవిశ్వాసులు విశ్వాసులుగా మార్పు చెందాలని, పరిశుద్ధులు పరిపూర్ణులుగా ఎదగాలని, పరిపూర్ణులు క్రీస్తు పరిచారకులుగా జీవించాలని, బైబిల్ జ్ఞానం అనేకమందికి నేర్పించాలని ఏకైక గురి కలిగి ఉన్నారు. మరియు ప్రజలకు ఆధ్యాత్మిక మానసిక భౌతిక మేలులు కలిగి అన్నిటిలో ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచాలని ఉద్దేశముతో ఆయన పరిచర్య జరిగిస్తున్నారు. వీరి కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించండి.